పూరి ఫ్లాపుల్లో ఉన్నాడు. యంగ్ హీరో రామ్ పరిస్థితి కూడా ఇంచు మించు అలానే ఉంది. ఇద్దరి సినిమాలూ దిమ్మ తిరిగే రేంజులో వసూళ్లు సాధించి చాలా కాలం అయ్యింది. అలాంటప్పుడు వీరిద్దరి కాంబినేషన్‌కి హైప్ ఎలా వస్తుంది? ఇస్మార్ట్ శంకర్ సినిమాని పూరి తన సొంత బ్యానర్‌లో తీస్తున్నాడు. ఈసారీ ఆస్తులు అమ్ముకునే సినిమాని పట్టాలెక్కించాడు. అలాంటప్పుడు ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత జరిగినా... జరిగినట్టే. సినిమాని ముందే అమ్మేసుకుని సేఫ్‌లో పడిపోవాలని చూడడం మామూలే.
కానీ పూరి మాత్రం సేఫ్ గేమ్ ఆడడం లేదు. కొన్ని ఏరియాల నుంచి పూరికి మంచి రేట్లే వచ్చినట్టు సమాచారం. ఇప్పుడు సినిమాని అమ్ముకుంటే.. పూరి గట్టెక్కినట్టే. కానీ... పూరి మాత్రం 'ఇప్పుడే సినిమాని అమ్మను' అని చెప్పేస్తున్నాడట. శాటిలైట్‌కి మంచి బేరం వచ్చినా... పూరి కదలడం లేదట. 'పది కోట్లు ఇస్తే తప్ప.. శాటిలైట్ ఇవ్వను' అని చెప్పేస్తున్నాడట. ఓ టీవీ ఛానల్ రూ.6 కోట్లకు బేరం పెడితే ససేమీరా అంటున్నాడట. నిజానికి పూరి, రామ్ సినిమాకి ఆరు కోట్లు చాలా ఎక్కువ.
కానీ.. పూరి జగన్నాధ్ మాత్రం తన సినిమాకి ఇంకా మంచి రేటు వస్తుందన్న భరోసాతో ఉన్నాడట. ఇది కాన్ఫిడెన్స్ అయితే ఫర్వాలేదు. ఓవర్ కాన్ఫిడెన్స్ అయితే మాత్రం.. పూరికి మొదటికే మోసం వస్తుంది. సినిమా విడుదల ముందు.. తమ సినిమాపై ఇంత ప్రేమ ఉండడం మామూలే. టీజరో, ట్రైలరో వస్తే గానీ... ఇస్మార్ట్ శంకర్ లో ఏముందో అర్థం కాదు. అంత వరకూ వెయిట్ అండ్ సీ.