రామ్‌గోపాల్ వర్మ అంటేనే సంచలనం. ప్రస్తుతం 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమా విడుదల పనుల్లో బిజీగా ఉన్న వర్మ అప్పుడే తన తదుపరి సినిమా పైనా ఫోకస్ పెట్టాడు. మళ్లీ బయోపిక్ బాటనే వర్మ ఎంచుకున్నట్లు తెలుస్తోంది. బయోపిక్‌లందు వర్మ బయోపిక్‌లు వేరయా. 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమాతో ఎన్టీఆర్ జీవిత చరమాంకంలోని ఆశక్తికరమైన ఘట్టాల్ని కథాంశంగా తీసుకున్న వర్మ తన తదుపరి సినిమా కోసం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి మరణానంతరం చోటు చేసుకున్న రాజకీయ అలజడిపై సినిమా చేయబోతున్నారట.
అంటే దీనర్ధం రామ్‌గోపాల్ వర్మ 'యాత్ర' సినిమాకి సీక్వెల్ తీస్తున్నారనుకోవాలి. ఎందుకంటే దర్శకుడు మహి.వి.రాఘవ 'యాత్ర' సినిమాలో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రజా ప్రస్థానం అంటూ చేపట్టిన పాదయాత్రను కథాంశంగా తీసుకుని సినిమా చేశాడు. సో వర్మ తీయబోయేది ఖచ్చితంగా సీక్వెలే అవుతుంది. కానీ వర్మ టేకింగ్, వర్మ పబ్లిసిటీ స్టంట్ డిఫరెంట్‌గా ఉంటాయి మరి.
క్రిష్ దర్శకత్వంలో బాలకృష్ణ తన తండ్రి ఎన్టీఆర్ బయోపిక్‌ని రెండు భాగాలుగా నిర్మించినా అసలు కోణాన్ని బయటపెట్టలేదు. దాంతో ఎన్టీఆర్ బయోపిక్‌లో మొదటి రెండు పార్ట్‌లు క్రిష్ తీశాడనీ, మూడో పార్ట్ 'లక్ష్మీస్ ఎన్టీఆర్'గా వర్మ తీశాడనీ అనుకుంటున్నాం. ఇప్పుడీ 'యాత్ర' సీక్వెల్ వ్యవహారం కూడా అంతే. ఈ చిత్రానికి కూడా వైఎస్సార్ సీపీనే ఫండింగ్ చేయబోతోందనీ సమాచారమ్.