2019 నందమూరి బాలకృష్ణకి కలిసొచ్చినట్లు లేదు. ప్రతిష్టాత్మకంగా రూపొందించిన 'ఎన్టీఆర్ బయోపిక్' పరాజయం తర్వాత బాలకృష్ణ ఒకింత డీలా మాట వాస్తవం. అయితే అది ఎన్నికల్లో ఎంత మేర ప్రభావం చూపుతుందన్నది ఇప్పుడే చెప్పలేం. నందమూరి తారకరామారావు జీవిత చరిత్రను తెలియజేసే క్రమంలో బాలకృష్ణ చేసిన తప్పిదాల్ని జనం గుర్తించారు.
పసలేని కథతో ఆ బయోపిక్ రూపొందించడం సహా అనేక అంశాలు ఎన్టీఆర్ అభిమానుల్ని నిరాశపరిచాయి. అదే సమయంలో 'యాత్ర' సినిమా విజయవంతమవడంతో బాలయ్య తీరు పట్ల అభిమానుల్లోనూ ఆందోళన వ్యక్తమయ్యింది. ఈ ప్రభావం బాలయ్య రాజకీయ జీవితంపైనా పడుతుందని కొందరు అంచనా వేస్తున్నారు. ఇంకో వైపున హిందూపురం నియోజకవర్గంలో చంద్రబాబు పట్ల తీవ్ర వ్యతిరేకత కన్పిస్తోంది.
హిందూపురంలో ప్రధానంగా తాగు నీటి సమస్య వుంది. లేపాక్షి ఉత్సవాల మీద చూపిన శ్రద్ధ, బాలయ్య తన నియోజకవర్గ అభివృద్ధిపై చూపలేదని స్థానికులు అంటున్నారు. అయితే ఒక్కసారి బాలయ్య నియోజకవర్గంపై పూర్తి దృష్టి పెడితే ఆ తర్వాత ఓట్లు పోటెత్తుతాయని తెలుగుదేశం పార్టీ నాయకులు చెబుతుండడం గమనించాల్సిన విషయం. 2014 ఎన్నికల్లో ఇదే నియోజకవర్గం నుంచి గెలిచి మీసం మెలేసిన బాలయ్య, ఈసారి గెలవడానికి చాలా కష్టపడాల్సిందే.