బళ్లు ఓడలవ్వడం, ఓడలు బళ్లుగా మారడం 'టాలీవుడ్'లో చాలా సాధారణమైన విషయం. రాత్రికి రాత్రే జాతకాలు మారిపోతుంటాయి. భారీ అంచనాలతో వచ్చిన సినిమాలు ఫ్లాప్ అవుతుంటాయి. ఎలాంటి చప్పుడూ లేకుండా వచ్చిన సినిమాలు బాక్సాఫీసు దగ్గర సంచలనాలు సృష్టిస్తుంటాయి. అలా 2018లో టాలీవుడ్‌ని షాక్‌లో ముంచెత్తుతూ... సర్‌ప్రైజ్ హిట్ అయిన సినిమా 'ఆర్‌ఎక్స్ 100'.
ఆర్‌ఎక్స్ 100 ఈ పేరు కాస్త ట్రెండీగానే ఉన్నా... ఎవరూ పెద్దగా ఆసక్తి చూపించలేదు. దానికి కారణం.. ఇందులో స్టార్స్ ఎవరూ లేరు. కార్తికేయ, పాయల్ రాజ్ పుత్.. ఇద్దరూ కొత్తవారే. దర్శకుడు అజయ్ భూపతికీ అంతకు ముందు సినిమాలు చేసిన అనుభవం లేదు. కాకపోతే ట్రైలర్లు బాగుండడంతో... కాస్త ఫోకస్ పడింది. ఈ సినిమాకి కాస్తో కూస్తో ఓపెనింగ్స్ వచ్చాయంటే కారణం.. ఆ ట్రైలర్లే.
కానీ... ఒక్కసారిగా సీన్ మారిపోయింది. థియేటర్లు కళకళలాడడం మొదలెట్టాయి. మౌత్ టాక్‌తోనే ఈసినిమా... యావరేజ్ నుంచి హిట్టు, హిట్టు నుంచి సూపర్ హిట్ స్థాయికి వెళ్లిపోయింది. అంతగా ఏముంది ఈసినిమాలో అంటే..? ఇది మామూలు ఫెయిల్యూర్ కథే. కాకపోతే.. అబ్బాయి అమ్మాయిని మోసం చేయడం కాదు. అమ్మాయే అబ్బాయిని మోసం చేసింది. ఆ పాయింట్ కుర్రాళ్లకు బాగా నచ్చేసింది.
కార్తికేయ సహజ నటన, పాయల్ రాజ్ పుట్ సెక్సీ చూపులు, పాటలు వెరసి ఈ సినిమాని హిట్ చేసేశాయి. రూ.2.5 కోట్లతో తీసిన సినిమా ఇది. అన్ని రూపాల్లోనూ కలసి దాదాపు రూ.15 కోట్లు ఆర్జించి పెట్టింది. ఇంతకంటే నిర్మాతలకు ఏం కావాలి? ఈ సినిమాలో నటించిన కార్తికేయ ఇప్పుడు బిజీ హీరోల్లో ఒకడైపోయాడు. పాయల్ కీ అవకాశాలొస్తున్నాయి. అజయ్ భూపతి పెద్ద హీరోల దృష్టిలో పడ్డాడు. అలా ఈ సినిమా అందరి జీవితాల్నీ రాత్రికి రాత్రే మార్చేసింది.
రీక్యాప్ 2018, ఐక్లిక్ మూవీస్ (iQlikmovies)