చిత్రసీమకు ఫ్లాపులు, అట్టర్ ఫ్లాపులు, డిజాస్టర్లు మామూలే. కాకపోతే 'అసలు ఈ సినిమా ఎందుకు తీశార్రా బాబూ' అనిపించుకోవడమే చెత్త సినిమాల లక్షణం. అలాంటి లక్షణాలు 2018లో పుష్కలంగా కనిపించిన చిత్రం 'అమర్ అక్బర్ ఆంటోనీ'.
అప్పటికే శ్రీనువైట్ల పై ఎవ్వరికీ నమ్మకాల్లేవు. రవితేజకు కూడా ఈ యేడాది అస్సలు కలసి రాలేదు. అయినా సరే.. వీరిద్దరి కాంబినేషన్‌పై ఏదో ఓ గుడ్డి నమ్మకం. పైగా... వరుస విజయాలతో దూసుకుపోతున్న మైత్రీ మూవీస్ ఈ చిత్రాన్ని నిర్మించింది. విజువల్స్ చూస్తుంటే భారీగా అనిపించాయి. ఇలియానా రీ ఎంట్రీ ఇవ్వడం.. `నేను పూర్తిగా మారిపోయి ఈ సినిమా తీశాను` అని శ్రీనువైట్ల పదే పదే చెప్పడంతో.. `అమర్ అక్బర్ ఆంటోనీ`పై కాస్తో కూస్తో ఆశలు కలిగాయి.
అయితే వాటన్నింటికీ తొలి షోతోనే మొగ్గ నుంచి తుంపేశాడు శ్రీనువైట్ల. కథ. కథనం, పాటలు... ఇలా ఏ విషయంలో చూసుకున్నా మైనస్సులే కనిపిస్తాయి. తల్లితండ్రుల్ని చంపినవాళ్లపై కొడుకు ప్రతీకారం తీర్చుకోవడం అనేది పరమ ఓల్డ్ ఫార్ములా. దాన్నే మళ్లీ శ్రీనువైట్ల నమ్ముకోవడం ఆశ్చర్యం కలిగించింది. మల్టిపుల్ పర్సనాలిటీ సినిమాలు చూసీ చూసీ జనాలకు బోర్ కొట్టేసింది. దాన్నే మళ్లీ పట్టుకుని, పాత కథని కొత్తగా చెప్పాలనుకున్న ప్రయత్నం దారుణంగా బెడసికొట్టింది. లాజిక్కులు చాలా చోట్ల మిస్సయిపోయాడు. వినోదం పండించిడంలో దిట్ట అయిన శ్రీనువైట్ల.. ఆ యాంగిల్ తనలో ఉందన్న సంగతి మర్చిపోయాడు.
చాలా కాలం తరవాత సునీల్ మళ్లీ కమిడియన్ పాత్ర చేశాడిందులో. తనని సైతం సరిగా వాడుకోలేకపోయాడు శ్రీనువైట్ల. రీ ఎంట్రీ ఇచ్చిన ఇలియానా కాస్త బొద్దుగా కనిపించడం ఆమె అభిమానులకు అంతగా రుచించలేదు. తమన్ బాణీలూ వర్కవుట్ కాలేదు. కర్ణుడి చావుకి వంద కారణాలన్నట్టు .. ఈ సినిమా పరాజయానికీ అన్నే కారణాలు కనిపించాయి. మొత్తానికి శ్రీనువైట్ల , రవితేజ కెరీర్‌లో ఓ భారీ డిజాస్టర్ చేరిపోయింది.
రీక్యాప్ 2018, ఐక్లిక్ మూవీస్ (iQlikmovies)