వర్మ తెరకెక్కిస్తున్న 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమాకి సంబంధించి కొన్ని ఫోటోల ద్వారా వర్మ కొన్ని హింట్స్ ఇస్తున్నాడు. ఇటీవల విడుదల చేసిన ఫోటోలో రకరకాల పాత్రధారులున్నారు. వారెవరో కనుక్కోండి అంటూ వర్మ ఆడియన్స్కి సవాల్ విసిరారు. అదో సిట్యువేషనల్ ఫోటో. అయితే అందులో ఉన్న పాత్రధారులు ఎవరనేది మనమే ఊహించుకోవాలి. అక్కడ ఏం జరుగుతోంది.. లక్ష్మీపార్వతిని కొందరు నిలదీస్తున్నారు. వారు ఎవరో కాదు, ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు.
లక్ష్మీపార్వతి అంటే ఎన్టీఆర్ కుటుంబమే. అంటే కుటుంబంలో కొందరి మధ్య జరుగుతున్న సంభాషణల సన్నివేశమది. ఆ సన్నివేశాన్ని యధాతథంగా చిత్రీకరించబోతున్నారు వర్మ. అయితే ఆ సన్నివేశంలో తప్పు ఎవరిది.? ఇంతవరకూ వర్మ 'లక్ష్మీపార్వతి' పాత్రను మాత్రమే ఇంట్రడ్యూస్ చేశాడు. మిగిలిన పాత్రధారుల పరిచయం జరగలేదు. కానీ అక్కడి సిట్యువేషన్ బట్టి ఫోటోలో ఉన్న వారు హరికృష్ణ, బాలకృష్ణ, పురంధేశ్వరి పాత్రలు కావచ్చు. అది మనం ఊహించుకోవాలి అంతే.
అలాగే అక్కడ ఎవరు ఎవర్ని నిలదీసున్నారనేది జడ్జ్ చేసుకోవల్సిన బాధ్యత కూడా ప్రేక్షకులదే. ఈ సినిమాలో వీళ్లు హీరోలు, వీళ్లు విలన్స్ అని వర్మ ఎక్కడా చెప్పడం లేదు. ఎంత తెలివైన ఆలోచన అది. వర్మకి మాత్రమే సాధ్యమైన ఆలోచన. పరిస్థితుల్ని బట్టి మనుషులు ఎలా బిహేవ్ చేస్తారు అని చెప్పేదే 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమా. అయితే ఇప్పుడు ఈ సినిమాపై చంద్రబాబు కానీ, ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు కానీ అభ్యంతరాలు చెప్పకుండా ఉంటారా.? చెబితే ఏంటి పరిస్థితి.? వేచి చూడాల్సిందే.