ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ బయోపిక్ తో హిందీలో ఓ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. శ్రద్దాకపూర్ సైనా పాత్రని పోషిస్తోంది. కొంత మేర చిత్రీకరణ కూడా జరిగింది. అయితే ఈ సినిమా నుంచి ఇప్పుడు శ్రద్దాకపూర్ తప్పుకుంది. ఆమెస్థానంలో పరిణితీ చోప్రా వచ్చింది. శ్రద్దాకపూర్కి డెంగ్యూ సోకిందని, అందుకే ఆమె ఈ సినిమా నుంచి తప్పుకున్నారని నిర్మాతలు చెబుతున్నారు.
అయితే శ్రద్దా ఈ సినిమా కోసం చాలా కష్టపడింది. పుల్లెల గోపీచంద్ దగ్గర నెల రోజుల పాటు బ్యాట్మెంటెన్లో శిక్షణ కూడా తీసుకుంది. కేవలం జ్వరం వచ్చిన కారణంతోనే శ్రద్దాని తప్పించారా? లేదంటే తెర వెనుక ఏమైనా జరిగిందా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటి వరకూ తెరకెక్కించిన సన్నివేశాల్ని ఇప్పుడు పరిణితీతో మళ్లీ రీషూట్ చేయాల్సిన అవసరం ఏర్పడింది. శ్రద్దా తప్పుకోవడంతో నిర్మాతలకు భారీ నష్టమే వచ్చినట్టైంది. 2020 డిసెంబరులో ఈ చిత్రం విడుదల కానుంది.