ముద్దుగుమ్మ సోనాలీ బింద్రే ఈ మధ్య క్యాన్సర్ వ్యాధితో బాధపడిన సంగతి తెలిసిందే. తాజాగా ఆమె క్యాన్సర్ నుండి కోలుకుని తిరిగి తన కొత్త జీవితాన్ని ప్రారంభించేందుకు సిద్ధమయ్యింది. ఈ సందర్భంగా ఆమె తన అనుభవాలను అభిమానులతో పంచుకుంది. క్యాన్సర్ ట్రీట్‌మెంట్ సమయంలోనూ సోనాలీ తన బాధను ట్విట్టర్ ద్వారా షేర్ చేసుకుంది. క్యాన్సర్ సోకిందని కుంగిపోకుండా, ధైర్యంగా ఆ వ్యాధిని ఎదిరించింది.
చివరకు క్యాన్సర్ మహమ్మారితో పోరాడి గెలిచింది. గెలిచిన తాను మరెంతో మంది క్యాన్సర్ బాధితులకు ఆదర్శంగా ఉండాలని నిర్ణయించుకుందట సోనాలి బింద్రే. తనలా క్యాన్సర్‌తో బాధపడుతున్న చాలా మందికి ధైర్యం నూరిపోసేలా స్వీయ అనుభవంతో సూచనలు చేస్తోంది. క్యాన్సర్ వచ్చిందంటే చాలు ఇక జీవితం ముగిసిపోయినట్లే అని భావించే రోజులు పోయాయి. ధైర్యంతో ఈ క్యాన్సర్ మహమ్మారిని జయించవచ్చునని సోనాలీ నిరూపించింది.
క్యాన్సర్ నుండి కోలుకున్నాక సోనాలీ బింద్రే తిరిగి తన కెరీర్‌లో బిజీ కానుంది. ఓ సినిమా నిమిత్తం సోనాలి బింద్రే సెట్స్‌లో సందడి చేసింది. కెమెరా ముందుకు రావడం కొత్త అనుభూతిని కలిగించిందనీ చెప్పుకొచ్చింది. అయితే ఆ సినిమా ఏంటనేది క్లారిటీ లేదు. కానీ గతంలో తెలుగు, తమిళ, హిందీ తదితర భాషల్లో పలు విజయవంతమైన చిత్రాల్లో నటించిన సోనాలీ నుండి మళ్లీ మరిన్ని సక్సెస్‌ఫుల్ మూవీస్‌ని ఎక్స్‌పెక్ట్ చేయొచ్చన్నమాట.