శ్రీరెడ్డి 'మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్' (మా) ఎన్నికలకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్ సోషల్ మీడియాలో పెట్టింది. అందులో నరేష్ మీద గౌరవం వుందంటూనే, మీ ప్యాన్‌లో వున్న వ్యక్తుల తీరు తెలిసీ ఎందుకు వారిని పక్కన వుంచుకున్నారంటూ శ్రీరెడ్డి, నరేష్ ప్యానల్‌ని తిరస్కరిస్తున్నట్లు చెప్పింది. శివాజీరాజా ప్యానల్‌కే తాను మద్దతిస్తున్నట్లు కూడా పేర్కొందామె. శ్రీరెడ్డి చెప్పింది కాబట్టి ఎవరైనా సినీ పరిశ్రమలో శివాజా రాజాకి అనుకూలంగా ఓటేస్తారనో, నరేష్‌కి వ్యతిరేకంగా ఓటేస్తారనో అనుకోవడానికి వీల్లేదు.
సినీ పరిశ్రమలో లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా శ్రీరెడ్డి తన పోరాటాన్ని మొదలు పెట్టినప్పటికీ, సినీ పరిశ్రమను ఆమె రోడ్డుకు ఈడ్చేసిన వైనం పట్ల చాలా విమర్శలు వచ్చాయి. సినీ పరిశ్రమలో ఎవరూ శ్రీరెడ్డి తీరుని సమర్థించలేరు. పైగా ఆమె సినీ పరిశ్రమకు వ్యతిరేకంగా ఆందోళనలు చేయడం అప్పట్లో పెను సంచలనమే అయ్యింది. తప్పనిసరి పరిస్థితుల్లో తెలుగు సినీ పరిశ్రమ ఓ మెట్టు దిగినట్లు కనిపించినా, ఆ తర్వాత అంతా మామూలే అయిపోయింది.
పైగా శ్రీరెడ్డి తెలుగు సినిమాని బజారుకీడ్చేందుకు ప్రయత్నించి, ఆ తర్వాత చెన్నయ్‌కి చెక్కేసి తమిళ సినీ పరిశ్రమపై మమకారం ప్రదర్శించింది. తిరిగి ఇప్పుడు ఓ తెలుగు సినిమాలో నటించడానికి వచ్చి, తెలుగు సినిమా రాజకీయాల్లో తలదూర్చుతోంది శ్రీరెడ్డి. ఆమె నటించే సినిమా విడుదలవుతుందో లేదో ఎవరికీ తెలియదు. అసలు సినిమా పూర్తయ్యేవరకు అందులో ఆమె ఉంటుందో లేదో చెప్పలేం. ఇంతకీ శ్రీరెడ్డి, నరేష్ ప్యానల్‌ని ఎందుకు వ్యతిరేకిస్తున్నట్లు? ఆమెకే తెలియాలి.