శ్రీదేవి తనయ జాన్వీ కపూర్ కథానాయికగా వడి వడిగా అడుగులేస్తోంది. గత ఏడాది దఢక్ తో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది జాన్వి. ఆ చిత్రం మంచి వసూళ్లని అందుకుంది. ఇప్పుడు భారత మహిళా వైమానిక యోధురాలు గుంజన్ సక్సేనా జీవితం ఆధారంగా తెరకెక్కనున్న బయోపిక్ లో నటిస్తుంది. ఈ చిత్రానికి `కార్గిల్ గాళ్` అనే పేరు ఖరారు చేశారు. ప్రస్తుతం లక్నోలో చిత్రీకరణ జరుపుకుంటోంది.
ఈ పాత్ర కోసం జాన్వీ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో ప్రత్యేక శిక్షణ తీసుకుంది. ఇదే పేరుతో ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లోనూ విడుదల చేయాలని చిత్రబృందం భావిస్తోంది. ఓ విధంగా చెప్పాలంటే ఇది లేడీ ఓరియెంటెడ్ చిత్రం. రెండో సినిమాతోనే నాయికా ప్రాధాన్యం ఉన్న పాత్ర పోషించడం అంత తేలికైన విషయం కాదు.
ఈసినిమాతో జాన్వీ కపూర్లోని పూర్తి స్థాయి నటి బయటకు రావడం ఖాయమని చిత్రబృందం ధీమాగా చెబుతోంది. దేశభక్తి నేపథ్యంలో వచ్చే చిత్రాలకు బాలీవుడ్లో గిరాకీ బాగా ఉంటుంది. ఇటీవల విడుదలైన `ఉరి`కి మంచి వసూళ్లు దక్కాయి. ఈ సినిమా కూడా అదే స్థాయిలో మెప్పిస్తుందన్నది ఈ కార్గిల్ గాళ్ నమ్మకం. ఏం జరుగుతుందో చూడాలి మరి.