సంక్రాంతి సంబరాలు ముగిశాయి. పెద్ద సినిమాల హడావుడి ఎక్కువగా ఉండడం వల్ల... చిన్న, ఓ మాదిరి సినిమాలు విడుదల కావడానికి ఇబ్బంది పడ్డాయి. ఇప్పుడు ఆ సీజన్ అయిపోవడంతో కొత్త సినిమాలు వరుస కడుతున్నాయి. అందులో భాగంగా ఈనెల 25న ప్రేక్షకుల ముందుకు వచ్చింది `మిస్టర్ మజ్ను`. ఈ సినిమాపై అటు నాగ్ అభిమానుల్లోనూ, ఇటు పరిశ్రమలోనూ మంచి అంచనాలే ఏర్పడ్డాయి.
`తొలి ప్రేమ` దర్శకుడు వెంకీ అట్లూరి తెరకెక్కించిన సినిమా ఇది. దానికి తోడు... తొలిసారి అఖిల్ తన వయసుకి తగిన లవ్ స్టోరీని ఎంచుకున్నాడు. ట్రైలర్లు, పాటలూ బాగున్నాయి. దాంతో మినిమం గ్యారెంటీ అనే ఫీలింగ్ ముందే వచ్చింది. దాదాపు 24 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. వరుసగా రెండు ఫ్లాపుల్లో ఉన్న అఖిల్‌కి ఈ స్థాయి వ్యాపారం జరగడం ఈ ప్రాజెక్టుపై ఉన్న నమ్మకాన్ని చాటి చెప్పింది.
అయితే శుక్రవారం విడుదలైన ఈ సినిమా అటు అభిమానుల్నీ, ఇటు పరిశ్రమనీ నిరాశ పరిచింది. రొటీన్ కథ, కథనాలతో విసిగెత్తించింది. అఖిల్ క్యారెక్టరైజేషన్ వరకూ `ఓకే` అనిపించుకున్న ఈ సినిమా మిగిలిన విభాగాల్లో తేలిపోయింది. మరీ ముఖ్యంగా ద్వితీయార్థంలో కథానాయకుడు - నాయిక మధ్య సంఘర్షణ కుదర్లేదు. దాంతో... `మిస్టర్ మజ్ను` అనుకున్న గమ్యాన్ని చేరుకోలేకపోయింది.
అఖిల్, హలో, మజ్ను... ఇలా పరాజయాలతో హ్యాట్రిక్ కొట్టినట్టైంది. తొలి రోజు ఓ మాదిరి వసూళ్లతో `ఓకే` అనిపించుకన్న `మజ్ను` శనివారం మరింత డల్ అయిపోయింది. ఆదివారం ఏమేరకు వసూళ్లు సాధిస్తుందనేదాన్ని బట్టి ఈ సినిమా ఏ రేంజులో పరాజయం పాలైంది అనేది లెక్కగట్టొచ్చు.