ఈ సంక్రాంతి సినిమాల రేసులో నిలిచింది 'పేట'. మన తెలుగు సినిమాలకు పోటీ ఇవ్వగల సత్తా.. పేటకు ఉంది. ఎందుకంటే ఇది రజనీకాంత్ సినిమా. తెలుగులో రజనీ సృష్టించిన అద్భుతమైన విజయాలు అన్నీ ఇన్నీ కావు. రోబో 2.ఓ కూడా కళ్లు చెదిరే ఓపెనింగ్స్ అందుకుంది. అలాంటి `పేట`కు తెలుగు నాట అన్యాయం జరుగుతోంది. ఈ సినిమాకి పట్టుమని రెండు వందల థియేటర్లు కూడా దొరకని పరిస్థితి వచ్చింది.
రజనీ సినిమా ఇంత తక్కువ థియేటర్లలో విడుదల అవ్వడం ఇదే తొలిసారి. దానికి కారణం ఒక్కటే. తెలుగులో మూడు పెద్ద సినిమాలు ఈ సంక్రాంతికే వస్తున్నాయి. ఎన్టీఆర్, వినయ విధేయ రామ, ఎఫ్ 2 విడుదలకు సిద్దమయ్యాయి. తెలుగు నాట సంక్రాంతి పెద్ద పండగ. సినిమాలకు అతి ముఖ్యమైన సీజన్. దీన్ని వదులుకోవాలని ఎవ్వరూ అనుకోరు. పైగా థియేటర్లన్నీ ఆయా నిర్మాతలు, పంపిణీదారుల చేతుల్లోనే ఉన్నాయి. అందుకే... `పేట`కు సరైన థియేటర్లు దొరకడం లేదు.
ఈ విషయమై తెలుగు నిర్మాత ఆగ్రహం కూడా వ్యక్తం చేస్తున్నాడు. థియేటర్ల మాఫియా ఎక్కువ అయిపోయిందని, అందుకే తనకు నీచమైన స్థాయిలో థియేటర్లు దొరికాయని, అయితే ఈ సినిమా విడుదలయ్యాక.. మౌత్ టాక్‌ని బట్టి థియేటర్లు పెరుగుతాయన్న నమ్మకం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారాయన. తెలుగు రైట్స్ కోసం దాదాపుగా రూ.15 కోట్లు ఖర్చు పెట్టారు. ఇప్పుడున్న అరాకొర థియేటర్లలో `పేట` విడుదలైతే ఈ మొత్తం దక్కించుకోవడం కష్టమే.