సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ సోదరుడు ఆనంద్ దేవరకొండ, సీనియర్ నటుడు రాజశేఖర్ - జీవిత దంపతుల కుమార్తై అయిన శివాత్మిక జంటగా తెరకెక్కుతోన్న చిత్రం 'దొరసాని'. లేటెస్ట్‌గా ఈ సినిమా టైటిల్ లోగోని విడుదల చేశారు. లోగో చూస్తుంటే ఇంట్రెస్టింగ్‌గా ఉంది. కానీ ఇదో పీరియాడికల్ స్టోరీని తలపిస్తోంది. గాలిలో ఎగురుతున్న రెడ్ కలర్ చున్నీ సింబాలిక్‌గా ఉంచి కింద 'దొరసాని' టైటిల్‌ని డిజైన్ చేశారు. టైటిల్ కింద ఓ పల్లెటూరి వాతావరణం ప్రతిబింబించేలా షేడోలో చూపించారు.
దగ్గరగా పరిశీలించి చూస్తే, ఆ షేడోలో ఓ పక్క సైకిలు, ఇద్దరు వ్యక్తులు ముచ్చటించుకుంటున్న వైనం, మరోపక్క చేతిలో జెండా పట్టుకుని ఓ వ్యక్తి ముందుకు నడుస్తుండగా, మరో ముగ్గురు ఆయన్ను ఆనుసరిస్తున్న వైనం తారసపడుతోంది. ఇదంతా చూస్తుంటే, అప్పుడెప్పుడో ఆర్య, అమీజాక్సన్ జంటగా వచ్చిన '1947 లవ్‌స్టోరీ' సినిమా తలపుకు వస్తోంది. ఆ సినిమాలో అమీజాక్సన్ బ్రిటీష్ యువతి కాగా, హీరో ఆర్య ఇండియన్ పోరాట యోధుడు.
1947లో స్వాతంత్య్రం కోసం పోరాటం జరుగుతున్న తరుణంలో వీరిద్దరి మధ్యా లవ్‌స్టోరీని చాలా ఎమోషనల్‌గా, హార్ట్ టచ్చింగ్‌గా తెరకెక్కించాడు డైరెక్టర్ విజయ్. ఆ సినిమాలో హీరోయిన్ పేరు దొరసానమ్మ. సో ఆ నేపథ్యంలో ఈ సినిమా ఉండబోతోందా.? అనిపిస్తోంది. అయితే టైటిల్ లోగోని చూసి అంచనా వేయలేం కదా, నటీ నటుల గెటప్స్, ప్రచార చిత్రాల ద్వారా ఓ అవగాహనకు రావచ్చు.
ఆనంద్ దేవరకొండకు, శివాత్మికకు ఇదే తొలి చిత్రం కావడం, తొలి సినిమాకే ఇలాంటి క్రిటికల్ సబ్జెక్ట్‌ని ఎంచుకోవడం అభినందించాల్సిన విషయమే. అటెంప్ట్ ఓకే రిజల్ట్ ఎలా ఉంటుందనేది మాత్రం అప్పుడే చెప్పలేం.