విజయబాపినీడు అనగానే చిరంజీవి గుర్తుకు రావడం సహజం. ఎందుకంటే... వాళ్లిద్దరి అనుబంధం అలాంటిది. విజయ బాపినీడు 19 చిత్రాలకు దర్శకత్వం వహిస్తే అందులో 9 చిత్రాలు చిరుతోనే. చిరుకి తొలిసారి కోటి రూపాయల పారితోషికం ఇచ్చిన దర్శకుడు కూడా విజయ బాపినీడే. గ్యాంగ్ లీడర్ సినిమాతో చిరు పారితోషికం కోటి అయ్యింది. అప్పట్లో ఇది రికార్డు. గ్యాంగ్ లీడర్ సూపర్ డూపర్ హిట్టవ్వడంతో... చిరు ఇమేజ్ మరింత పెరిగిపోయింది.
చిరంజీవి అంటే విజయబాపినీడుకి ఎంత అభిమానం అంటే.. `చిరంజీవి` పేరిట ఓ పత్రిక స్థాపించి, దానికి సంపాదకుడుగా ఉన్నారాయన. `చిరంజీవితోనే ఉంటే మిగిలిన హీరోలు రానివ్వరు` అని సన్నిహితులు హెచ్చరించినా ఎవ్వరి మాట లెక్కచేయలేదు. చిరుని అప్పట్లో `సుప్రీం హీరో` అని పిలిచేవారు. ఆ తరవాత `మెగాస్టార్` బిరుదు వచ్చింది. ఈ బిరుదుని పాపులర్ చేసింది విజయబాపినీడే.
చిరంజీవి - విజయ బాపినీడు కాంబినేషన్‌లో వచ్చిన చివరి చిత్రం.. `బిగ్ బాస్`. ఈ సినిమా డిజాస్టర్ గా మిగిలింది. ఆ పరాభవ భారంతోనే విజయబాపినీడు సినిమాలకు దూరమయ్యారని చెబుతుంటారు. బిగ్ బాస్ తరవాత రెండే రెండు సినిమాలకు దర్శకత్వం వహించి చిత్ర రంగానికి స్వస్తి పలికారు బాపినీడు.