ఇటీవల చైతూ 'మజిలీ' సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చి, మంచి టాక్ తెచ్చుకున్నాడు. ఇతర పెద్ద సినిమాలేమీ లేకపోవడమనే కారణమో, లేక సమంత రూపంలో కలిసొచ్చిన లక్కు కారణమో తెలీదు కానీ, 'మజిలీ'తో చైతూ హిట్ అయితే కొట్టాడు. ఇక నాని విషయం తీసుకుంటే, 'జెర్సీ'తో రాబోతున్నాడు. వీరిద్దరికీ పోలికేంటంటే, ఇద్దరూ ఒకే కాన్సెప్ట్‌ని బేస్ చేసుకున్నారు. అదే క్రికెట్. నేపథ్యం ఒక్కటే కానీ, థీమ్ వేరే.
అల్లరి చిల్లరి కుర్రోడికి క్రికెట్ లక్ష్యమైతే, క్రికెట్‌నే ప్రాణంగా భావించిన కుర్రోడికి కుటుంబం భారమైతే.. అనేది ఈ రెండు సినిమాల్లోనూ గమనించాల్సిన ముఖ్యమైన పాయింట్స్. అయితే ఇద్దరూ భార్య సంపాదన మీద ఆధారపడిన క్రెకెటర్స్ కావడమే ఈ రెండు సినిమాల్లోనూ కామన్ పాయింట్. చైతూ ఎలాగో ఈ పాయింట్‌తో ఓకే అనిపించేసుకున్నాడు. ఇక నాని టర్న్ మిగిలి ఉంది. వచ్చే వారమే నాని 'జెర్సీ'తో తన స్టామినాని టెస్ట్ చేసుకోబోతున్నాడు. ప్రచార చిత్రాల్లో నాని పండించిన ఎమోషన్ హార్ట్ టచ్చింగ్‌గా ఉంది.
పక్కింటబ్బాయ్‌లా కనిపించే నాని జెర్సీ సినిమా కోసం ఒకింత సాహసం చేశాడనే అనుకోవాలి. 10 ఏళ్ల కుర్రాడికి తండ్రిగా, 36 ఏళ్ల వయసున్న అంకుల్‌లా కనిపించబోతున్నాడు. టీనేజ్ కుర్రోడిలా, పెళ్లి తర్వాత భర్త పాత్ర కోసం రెండు వేరియేషన్స్ చూపించి, నాని ఇప్పటికైతే మంచి మార్కులే వేయించుకున్నాడు. ఇక రిలీజ్ తర్వాత ఎలాంటి బజ్ క్రియేట్ అవుతుందో చూడాలిక. శ్రద్ధా శ్రీనాధ్ ఈ సినిమాలో నానికి లవర్‌గా, భార్యగా నటిస్తోంది. మళ్ళీ రావా ఫేమ్ గౌతమ్ తిన్ననూరి ఈ సినిమాకి దర్శకత్వం వహించారు.