వస్తూ వస్తూనే 'ముకుందా' అంటూ ఓ డిఫరెంట్ యూత్‌ఫుల్ మూవీతో వచ్చి సాహసం చేశాడు. సాహసం ఫలించింది. అదే పంథాలో నడుస్తూ వచ్చాడు. టేకప్ చేసిన ప్రతీ సాహసాన్ని విజయంగా మలచుకున్నాడు. విలక్షణ మెగా హీరో అనిపించుకున్నాడు. అవునండీ మెగాప్రిన్స్ వరుణ్‌తేజ్ గురించే మాట్లాడుకుంటున్నాం. ఒకే జోనర్‌కి ఫిక్సయిపోకుండా, డిఫరెంట్ జోనర్స్ ట్రై చేస్తూ, సాధ్యం కానిదేదీ లేదని నిరూపించుకుంటున్నాడు. నటుడిగా వేరియేషన్స్ చూపిస్తున్నాడు.
'ఫిదా'తో పక్కా రొమాంటిక్ లవ్ స్టోరీలో నటించి యూత్‌ని ఎట్రాక్ట్ చేసిన వరుణ్, 'అంతరిక్షం' సబ్జెక్తో మరోసారి సాహసానికే ఓటేశాడు. 'తొలిప్రేమ'లాంటి క్రిటికల్ లవ్‌స్టోరీతో హిట్ కొట్టి, అస్సలు టచ్ లేని కామెడీ ఓరియెంటెడ్ సబ్జెక్ట్ 'ఎఫ్ 2'తో బంపర్ హిట్ కొట్టాడు. ఇప్పుడు మరో సాహసానికి కాలు దువ్వుతున్నాడీ యంగ్ హీరో. హరీష్ శంకర్ దర్శకత్వంలో వరుణ్ ఓ సినిమా చేయబోతున్నాడనే ప్రచారం జరుగుతోంది. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుందట.
అయితే ఈ సినిమాలో వరుణ్ నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్ర పోషించనున్నాడనీ టాక్. వరుణ్ సైన్ చేశాడంటే అదేదో డిఫరెంట్ కాన్సెప్ట్ అనే భావించాలి. నెగిటివ్ షేడ్స్‌లో ఏమో చేసినా చేస్తాడు. కాదనడానికేం లేదు. 'గబ్బర్‌సింగ్' సినిమాతో సూపర్ డూపర్ హిట్ కొట్టిన హరీష్ శంకర్‌కి ఈ మధ్య ఏదీ కలిసి రావడం లేదు. వరుణ్ రూపంలో ఈ తాజా మూవీ అయినా హరీష్‌కి సక్సెస్ తెచ్చిపెడుతుందేమో చూడాలిక.