వై.ఎస్.ఆర్ జీవిత కథ అంటూ ప్రచారం జరుగుతున్న 'యాత్ర' సినిమా మరి కొద్ది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. విడుదల తేదీ దగ్గర పడుతున్న కొద్దీ ఈ సినిమాకి సంబంధించిన ఆసక్తికరమైన అంశాలు ఒకొక్కటి బయటకు వస్తున్నాయి. అసలు ఈ చిత్రాన్ని బయోపిక్‌గానే చూడొద్దన్నది ఈ చిత్ర దర్శకుడు మహి వి.రాఘవ చెబుతున్నమాట.
వై.ఎస్.ఆర్ చేసిన పాద యాత్ర చుట్టూనే ఈ సినిమా నడవబోతోంది. పాత యాత్రకు ముందున్న పరిస్థితులు, పాదయాత్ర... ఇవి మాత్రమే ఈ సినిమాలో కనిపిస్తాయి. పాదయాత్రతోనే వైఎస్ఆర్ ప్రజల అభిమానాన్ని, నమ్మకాన్ని గెలుచుకుని ముఖ్యమంత్రిగా మారారు. ఆ ఘట్టం మాత్రమే ఈ సినిమాలో కనిపించనుంది. అదీ కూడా.. కొన్ని కల్పిత సన్నివేశాలు జోడించారని టాక్. వైఎస్ఆర్ మరణం సైతం ఈ పాద యాత్రలో చూపించడం లేదట.
నిజానికి వైఎస్ఆర్ మరణంతో ఈ సినిమాలో కావల్సినంత డ్రామా సృష్టించే వీలుంది. కానీ... మహి మాత్రం ఈ విషాదాన్ని వెండి తెరపై చూపించలేదంటున్నాడు. పాద యాత్రలోనే కావల్సినంత డ్రామా పండిందని, వైఎస్ఆర్ లోని వ్యక్తిత్వం పాదయాత్రకు ముందు ఒకలా, ఆ తరవాత ఒకలా మారిందని, ఆ డ్రామా చాలని తేల్చేశాడు. సో.. ఇది బయోపిక్ కాదు. ఓ వ్యక్తి జీవితంలో ఓ భాగం మాత్రమే. ఈ సినిమాని అలా చూస్తేనే మంచిదేమో..?!