టాలీవుడ్‌లోనే కాదు... దేశంలోనే అత్యధిక పారితోషికం తీసుకుంటున్న దర్శకులలో ఎస్.ఎస్.రాజమౌళి ఒకరు. బాహుబలికి ఆయన వాటాగా రూ.60 కోట్లకుపైనే అందినట్టు టాలీవుడ్ టాక్. అంటే సినిమాకి రూ30 కోట్లన్నమాట. త్రివిక్రమ్, బోయపాటి శ్రీనులు చెరో రూ.15 కోట్ల పారితోషికం తీసుకుంటున్నారు. దాదాపుగా స్టార్ హీరోలు అందుకునే రెమ్యునరేషన్‌కి ఇది సమానం. వీళ్లకంటే కొరటాల శివ పారితోషికమే ఎక్కువని టాలీవుడ్ సమాచారం.
ఈ దర్శకుడు తీసిన సినిమాలన్నీ బ్లాక్ బ్లస్టర్ హిట్లే. మిర్చి, శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, భరత్ అనే నేను.. ఇలా ఒకదాన్ని మించి మరో విజయం. అందుకే పారితోషికానికీ రెక్కలొచ్చాయని సమాచారం. ఈ దర్శకుడి ప్రస్తుత పారితోషికం రూ.20 కోట్లనీ, అదీ జీఎస్‌టీలు మినహాయించి ఇవ్వాలని, సింగిల్ పేమెంట్ సెటిల్ చేయాలని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.
ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి కోసం ఓ కథ సిద్ధం చేస్తున్నారాయన. కొణిదెల ప్రొడక్షన్స్, మాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థలు ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ సినిమా కోసం కొరటాల 20 కోట్లు అందుకోబోతున్నట్టు తెలుస్తోంది. ఆ లెక్కన రాజమౌళి తరవాత అత్యధిక పారితోషికం తీసుకునే దర్శకుడు కొరటాలనే అవుతారు.