టాలీవుడ్ లో సంక్రాంతికి విడుదలయ్యే సినిమాలకి మంచి క్రేజ్ ఉంటుంది. ఈ సంక్రాంతి బరిలో విడుదలైన ఫుల్ మాస్ సినిమా 'వినయ విధేయ రామ'. బోయపాటి దర్శకత్వంలో చరణ్ చేసిన మొదటి సినిమా ఇది. వీరిద్దరూ ఫామ్‌లో ఉన్నవారే. అదీకాక మాస్ చిత్రాలను తెరకెక్కించడంలో బోయపాటి దిట్ట. అందుకే ఈ సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి. అయితే... ఆ అంచనాల్ని అందుకోవడంలో 'వినయ విధేయ రామ' పూర్తిగా విఫలమైంది అనే చెప్పుకోవాలి. ఈ సినిమాతో అటు నిర్మాతలూ, ఇటు డిస్ట్రిబ్యూటర్లూ బాగా నష్టపోయారు.
డి.వి.వి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్ తో తెరకెక్కించబడిన ఈ సినిమా తొలి షోకే ఫ్లాప్ టాక్ తెచ్చుకుని డిజాస్టర్ గా మిగిలిపోయింది. సంక్రాంతి సీజన్ కాబట్టి తెలుగు రాష్ట్రాల్లో మొత్తం మీద రూ. 60.9 కోట్ల షేర్ ని సొంతం చేసుకుని వసూళ్ల పరంగా పర్వాలేదనిపించుకుంది. కానీ.. ఓవర్సీస్ లో మాత్రం ఈ సినిమా ఘోరమైన పరాజయాన్నందుకుంది. 'రంగస్థలం' వంటి సూపర్ హిట్ తర్వాత రామ్ చరణ్ నుండి వచ్చిన చిత్రం కావడంతో 'వినయ విధేయ రామ'కి ఓవర్సీస్ లో ప్రీ రిలీజ్ బిజినెస్ మంచిగా జరిగింది.
కానీ.. విడుదల తర్వాత అంచనాలన్నీ తారుమారయ్యాయి. ఓవర్సీస్ బాక్స్ ఆఫీస్ వద్ద 'వినయ విధేయ రామ' బొక్క బోర్లా పడింది. దీంతో.. ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్ కి ఊరట కలిగించటానికి నిర్మాత దానయ్య రూ. 50 లక్షలు వెనక్కి ఇచ్చేశారంట. మిగిలిన డిస్ట్రిబ్యూటర్లతో కూడా సంప్రదింపులు జరిపి వారికి కలిగిన నష్టాన్ని ఎంతోకొంత భర్తీ చేసే ఆలోచనలో ఉన్నారంట నిర్మాత. కాగా, ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ కలిసి నటిస్తున్న భారీ మల్టీస్టారర్ సినిమా 'ఆర్ఆర్ఆర్' కూడా డి.వి.వి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ లోనే నిర్మించబడుతుంది.