ఈ పండగ సీజన్‌లో రాబోతున్న చివరి సినిమా `ఎఫ్ 2`. ఎన్టీఆర్ తో మొదలైన సంక్రాంతి హడావుడి `ఎఫ్ 2`తో పూర్తవుతుంది. వెంకటేష్, వరుణ్‌తేజ్‌లు తొలిసారి కలిసి నటించడం, కామెడీ మార్క్‌తో పూర్తి కమర్షియల్ సినిమాలు తీసే అనిల్ రావిపూడి ఈ చిత్రానికి దర్శకుడు కావడం, దిల్ రాజు సంస్థ నుంచి ఈ చిత్రం బయటకు వస్తుండడంతో... అంచనాలు బాగానే ఉన్నాయి. ఇప్పటి వరకూ వచ్చిన మూడు సినిమాలూ అంతంతమాత్రంగానే ఉండడంతో.. ఎఫ్ 2 అయినా టార్గెట్‌ని రీచ్ అవుతుందేమో అని ఆశగా ఎదురుచూస్తున్నారంతా.
సంక్రాంతి సీజన్, పైగా క్లీన్ యూ సినిమా కాబట్టి.. ఫ్యామిలీ ఆడియన్స్ దృష్టి ఈ సినిమాపై ఎక్కువగా పడే అవకాశం ఉంది. అందుకే పంపిణీదారులు భారీ మొత్తం వెచ్చించి ఈ సినిమాని తీసుకున్నారు. దిల్‌రాజు తన పాత బయ్యర్లకే ఈ సినమాని అడ్వాన్స్ ప్రాతిపదికన కట్టబెట్టాడు. రెండు తెలుగు రాష్ట్రాలలో రూ.35 కోట్ల వరకూ బిజినెస్ జరుపుకుంది. నైజాంలో రూ.9 కోట్లు, సీడెడ్‌లో రూ.5 కోట్లు, ఆంధ్రాలో రూ.14 కోట్లకు ఈ సినిమా కొన్నట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. వెంకటేష్ కెరీర్‌లో ఈ స్థాయి బిజినెస్‌జరగడం ఇదే తొలిసారి. ఓవర్సీస్‌లో రూ.4.25 కోట్లకు అమ్ముడుపోయింది. అక్కడ ఈ సినిమాకి మంచి రేటు పలికినట్టే.