కన్నడ సినిమా స్టామినాని ప్రపంచానికి చెప్పిన చిత్రం 'కేజీఎఫ్ చాప్టర్ 1'. బంగారు గనుల నేపథ్యంలో సాగే ఈ సినిమా... నిజంగానే బంగారు పంట పండించింది. దాదాపు 200 కోట్లు వసూలు చేసి భారతీయ చిత్రసీమకు షాక్ ఇచ్చింది. ఇప్పుడు చాప్టర్ 2కు శ్రీకారం చుట్టేసింది చిత్రబృందం. ఈరోజు ఉదయం బెంగళూరులోని కోదండరామ ఆలయంలో పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కన్నడ రాక్ స్టార్ యశ్ కథానాయకుడు. తొలి భాగంలో శ్రీనిధి శెట్టి కథానాయికగా కనిపించింది. తనే పార్ట్ 2లోనూ హీరోయిన్ గా కనిపించనుంది.
అయితే చాప్టర్ 2లో మరిన్ని కొత్త పాత్రలు చూసే వీలు దక్కుతోంది. బాలీవుడ్ నటుడు ఫర్హాన్ అక్తర్ ఇందులో కీలక పాత్రలో నటిస్తున్నారు. ఏప్రిల్ నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది. గత ఏడాది డిసెంబర్ 21న తెలుగు, మలయాళం, హిందీ, తమిళ, కన్నడ భాషల్లో ‘కేజీఎఫ్’ విడుదలైంది. ఈ చిత్రం 18 రోజుల్లో రూ.200 కోట్ల మేరకు వసూళ్లను రాబట్టింది. ఇప్పటివరకు ఏ కన్నడ చిత్రమూ ఇన్ని భాషల్లో విడుదల కాలేదు, ఇంతటి స్థాయిలో వసూళ్లూ రాబట్టలేదు. రెండో భాగం మరో 200 కోట్లు రాబట్టడం ఖాయమని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అదే జరిగితే కేజీఎఫ్ మరోసారి చరిత్ర సృష్టించినట్టే.