మెగా హీరోల్లో సాయిధరమ్ తేజ్‌కి దురదృష్టం బాగా వెంటాడుతోంది. పెద్ద దర్శకులు, పెద్ద బ్యానర్లతో సినిమాలు చేసినా.. హిట్టు దక్కడం లేదు. కొత్తవారితో ప్రయోగాలు చేసినా ప్రేక్షకులు కనికరించలేదు. వరుసగా ఆరు ఫ్లాపులతో ఉక్కిరి బిక్కిరి అయ్యాడు. ఇక సాయి పని అయిపోయిందనుకుంటున్న తరుణంలో 'చిత్రలహరి' వచ్చింది. మైత్రీ మూవీస్ నుంచి వచ్చిన సినిమా కావడం, రెండు హిట్లు కొట్టిన కిషోర్ తిరుమల ఈ చిత్రానికి దర్శకత్వం వహించడంతో.. ఆరు ఫ్లాపుల లెక్కలేవీ వేయకుండానే బిజినెస్ బాగా జరిగిపోయింది.
దాదాపుగా 13 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరగడం, శాటిలైట్, డిజిటల్ రైట్స్ రూపంలోనూ డబ్బులు బాగానే రావడంతో నిర్మాతలు విడుదలకు ముందే సేఫ్ అయ్యారు. శుక్రవారం విడుదలైన ఈ చిత్రం కాస్త డివైడ్ టాక్ తెచ్చుకుంది. సినిమా బాగానే ఉందిగానీ, స్లో నేరేషన్ అని తేల్చేశారు విశ్లేషకులు. అయితే వీటిని పట్టించుకోకుండా ప్రేక్షకులు మాత్రం ఈ సినిమాని బాగానే ఆదరిస్తున్నారు. తొలి రోజు ఏకంగా 3 కోట్ల షేర్ తెచ్చుకుంది. శనివారం కూడా వసూళ్లు బాగున్నాయి. ఆదివారం కూడా ఇదే టెంపో కొనసాగింది.
మొత్తానికి తొలి మూడు రోజుల్లో చిత్రలహరి.. మంచి వసూళ్లు అందుకోగలుగుతోంది. వరుస ఫ్లాపుల తరవాత, డివైట్ టాక్ వచ్చి కూడా ఈ రేంజు వసూళ్లు రావడం గొప్ప విషయమే. క్రితం వారం విడుదలైన 'మజిలీ'కి కూడా టికెట్లు బాగానే తెగుతున్నాయి. ఇప్పటికే మజిలీ బ్రేక్ ఈవెన్ దశ దాటేసి, లాభాల బాట పట్టింది. ఏసెంటర్లలో చిత్రలహరి కంటే మజిలీకే ఎక్కువ ఆదరణ లభిస్తోంది. అటు మజిలీ, ఇటు చిత్రలహరి.. రెండు సినిమాలతో బాక్సాఫీసు కిటకిటలాడుతోంది.
వచ్చేవారం నేచురల్ స్టార్ నాని నటించిన 'జెర్సీ' విడుదలకు సిద్ధమవుతోంది. దాంతో పాటు లారెన్స్ కాంచన 3 (ముని 4) కూడా రంగంలోకి దిగుతోంది. ఈ సినిమాలతో.. బాక్సాఫీసుకి మరింత ఉత్సాహం రావడం ఖాయం.