'ఎన్టీఆర్' బయోపిక్ మొదలైనప్పటి నుంచీ అనేక రూపాల్లో వార్తల్లో నిలుస్తూనే ఉంది. నందమూరి అభిమానులు ఈ సినిమా గురించి మాట్లాడుకుంటూనే ఉన్నారు. అందరిలోనూ మెదిలే ప్రశ్న ఒకటే. 'జూనియర్ ఎన్టీఆర్‌ని ఎందుకు తీసుకోలేదు' అన్నదే. ఎన్టీఆర్ కీ బాలయ్యకీ మధ్య కోల్డ్ వార్ నడుస్తోందని, అందుకే ఈ సినిమాలో ఎన్టీఆర్‌కి చోటు దక్కకుండా పోయిందన్నది జగ మెరిగిన సత్యం. ఆ రూపంలో నందమూరి అభిమానుల దగ్గర ఓ సమాధానం ఉంది.
అయితే.. ఈమధ్య వారిద్దరి మధ్య రాపో బాగానే పెరుగుతోంది. 'అరవింద సమేత' ఫంక్షన్‌కి బాలయ్య రావడం, `ఎన్టీఆర్` వేడుకకు ఎన్టీఆర్ వెళ్లడంతో అది మరింత బలపడింది. ఇలాంటి తరుణంలోనూ ఎన్టీఆర్ బయోపిక్‌లో తారక్‌కి చోటు దక్కలేదు. 'చిన్న పాత్ర ఇచ్చినా బాగుండేది కదా.. ఈ సినిమాకి మరింత మైలేజీ వచ్చేది' అనేది అభిమానుల మాట.
దీనిపై కళ్యాణ్ రామ్ కూడా కొన్ని ఆసక్తికరమైన కామెంట్స్ చేశాడు. ప్రింట్ మీడియాకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో కళ్యాణ్ రామ్ ఈ విషయమై మాట్లాడాడు. ఈ బయోపిక్‌లో తన బాబాయ్ పాత్రకే చోటు లేదని, సినిమాకి ఏం కావాలో అదే తీసుకున్నారని క్లారిటీ ఇచ్చాడు. తారక్ ఉన్నాడు కదా అని ఏదో ఒక చిన్న పాత్ర ఇచ్చి చేతులు దులుపుకోవడం బాబాయ్‌కి ఇష్టం లేదన్నది కళ్యాణ్ రామ్ మాట.
ఆడియో ఫంక్షన్‌కి ఎన్టీఆర్ రావడం, ఆయన చేతుల మీదుగా ఆడియో విడుదల కావడం.. గొప్ప విషయమని, అదే తారక్‌ని బాబాయ్ ఇచ్చిన గౌరవం అని చెబుతున్నాడు కళ్యాణ్ రామ్. సో.. తమ మధ్య ఎలాంటి దూరం లేదని, తామంతా ఒక్కటే అనే సందేశాన్ని కళ్యాణ్ రామ్ ఈ రూపంలో పంపాడన్నమాట.