లంచగొండితనాన్ని సహించని ఓ వృద్ధుడు ఎలా ఆ అవినీతిని ఎదిరించాడనే నేపథ్యంలో 26 ఏళ్ల క్రితం శంకర్ తెరకెక్కించిన సినిమా 'భారతీయుడు'. అప్పట్లో ఆ సినిమా సంచలనాలు సృష్టించిన సంగతి తెలిసిందే. ఇన్నాళ్ల తర్వాత మళ్లీ ఆ సినిమాకి సీక్వెల్ రూపొందిస్తున్నాడు శంకర్. కాగా ప్రస్తుతం సమాజంలో ఓ సామాన్య వ్యక్తి ఎదుర్కొంటున్న అనేక సమస్యల్ని ఈ సినిమాలో కళ్లకు కట్టినట్లు చూపించబోతున్నాడట శంకర్.
అసలింతకీ ఈ సినిమాకి కథ ఎలా పుట్టిందంటే, ఆయన రియల్ లైఫ్ సంఘటన నుండే పుట్టుకొచ్చిందట. శంకర్ చదువుకునే రోజుల్లో కాలేజీలో అడ్మిషన్ కోసం వెళిలే కేస్ట్ సర్టిఫికెట్ తదితర ఫార్మాలిటీస్ అడుగుతారు అది సహజమే. అయితే వాటిని సంపాదించేందుకు సంబంధిత అధికారులకు చేతులు తడిపితే తప్ప ఆ పనులు అంత సులువుగా కాని పరిస్థితి. ఈ సమస్యను ప్రతీ సామాన్యుడూ ఎదుర్కొనేదే. అదే శంకర్ కూడా ఎదుర్కోవాల్సి వచ్చింది.
అయితే శంకర్‌లో క్రియేటివిటీ ఉంది కాబట్టి, ఆ పాయింట్‌ని టార్గెట్‌గా చేసుకుని సినిమా రూపొందించాడు. మంచి విజయం దక్కించుకున్నాడు. అప్పటితో పోల్చితే సామాన్యుని సమస్యలు ఇప్పుడు చాలా ఎక్కువైపోయాయి. అందుకే భారతీయుడు 2'లో ఆ సమస్యల్ని అంతకు మించిన రేంజ్‌లో చూపించబోతున్నాడట. కమల్‌హాసన్ హీరోగా తెరకెక్కుతోన్న ఈ చిత్రం లేటెస్టుగా షూటింగ్ ప్రారంభమైంది. భారీ బడ్జెట్ చిత్రంగా లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌లో రూపొందుతోంది. చందమామ కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోంది.