బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ నటించిన 'మణికర్ణిక' చిత్రం ప్రారంభమైనప్పటి నుండే వివాదాలతో సావాసం చేస్తోంది. నిర్మాణ దశలోనూ వివాదాలే. విడుదయ్యాక కూడా వివాదాలే. ఈ సినిమా సాధించిన వసూళ్ల పరంగా వార్తలెన్ననే చర్చ పక్కన పెడితే, ఈ సినిమా విషయంలో రాజుకుంటున్న కొత్త కొత్త వివాదాల చర్చే ఎక్కువగా ఉంది.
డైరెక్టర్ క్రిష్‌తో జరిగిన వివాదం, ఆయన్ని కంగనా ఆడిపోసుకున్న విధానం, క్రిష్ కంగనాకిచ్చిన కౌంటర్లు, సోనూసూద్ కౌంటర్లు.. ఇలా ఇవన్నీ పక్కన పెడితే, ఇప్పుడీ చర్చ పక్కదారి పడుతున్నట్లనిపిస్తోంది. కంగనాపై బాలీవుడ్ పగ పట్టిందా.? తెర వెనుక కంగనాపై కుట్ర జరుగుతోందా.? బాలీవుడ్ అంతా ఏకమై కంగనాని సెపరేట్ చేసేశారా.? అంటే జరుగుతున్న పరిస్థితులు అందుకు పోజిటివ్‌గానే అనిపిస్తున్నాయి. కంగనా సహనాన్ని పరీక్షిస్తున్నట్లున్నాయి. చాలా కొద్ది మంది మాత్రం కంగనాకి సపోర్ట్‌గా నిలిచినా, దాదాపు బాలీవుడ్ అంతా కంగనాకి వ్యతిరేకంగా నిలిచింది.
ఛాన్స్ దొరికింది కదా అని ఒక్కొక్కరుగా బయటికి వస్తున్నారు. అలా అని కంగనా ఏమంత తక్కువ తినలేదులెండి. ఎవరిది వారికి ఎప్పటికప్పుడే అప్పచెప్పేస్తోందిలే. ఆ విషయంలో కంగనా ధైర్యానికే కొంత అసూయ పడుతున్నారనుకోవాలి ఆమెకు వ్యతిరేకంగా మాట్లాడేవాళ్లు. చివరికి ఎవరెవరు తనను ధూషిస్తున్నారో, వాళ్లని ఊరికే వదిలిపెట్టననీ, వారి బండారాలన్నీ బయటపెడతానని సీరియస్‌గా వార్నింగ్ ఇచ్చేసింది మన రియల్ వీరనారి కంగనా రనౌత్.