ఓ పక్క రియల్ లైఫ్ భార్యగా తన భర్తకు ఖచ్చితంగా హిట్ ఇవ్వాల్సిన పరిస్థితి. రీల్ లైఫ్‌లో భార్యగా తన భర్తను ఎన్ని తప్పులు చేసినా కాపాడుకోవాల్సిన పరిస్థితి.. ఇదీ ప్రస్తుతం సమంత సిట్యువేషన్. ఇటు రీల్ లైఫ్‌లోనూ, అటు రియల్ లైఫ్‌లోనూ కూడా సమంతకు 'మజిలీ' ఛాలెంజింగ్ మూవీ కాబోతోంది. ఈ నెల 5న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న 'మజిలీ'పై నాగచైతన్య, సమంతకు పెళ్లి తర్వాత జంటగా రూపొందిన తొలి సినిమా కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి.
కథా, కథనాల ప్రకారం సినిమాపై ఆశక్తి బాగానే నెలకొంది. టీజర్‌తోనే ఓ మోస్తరు ఐడియాకొచ్చేశారు జనం. ఇక ట్రైలర్ వచ్చాక చైతూ, సమంతల క్యారెక్టర్స్‌పై పూర్తిగా ఓ ఐడియాకొచ్చేశారు. బేవర్స్‌గా తిరిగే కుర్రాడికి పెళ్లి చేసేస్తే బతుకు బాగుపడుతుందని చాలా మంది ఇళ్లలోని పెద్దవాళ్లకు సహజంగా ఉండే అభిప్రాయం. సరిగ్గా అదే క్యాజువల్ పాయింట్‌ని తీసుకుని డైరెక్టర్ శివ నిర్వాణ ఈ సినిమాని తెరకెక్కించాడు. చైతూ, సమంతల పాత్రలు రెండింటికీ పర్‌ఫామెన్స్‌కి స్కోపుంది ఈ సినిమాలో.
ఈ ఇద్దరి మధ్య ఓ పెళ్లయిన కుర్రాడి ప్రేమను కోరుకునే యువతిగా దివ్యాంశ కౌశిక్ నటన కూడా ఆకట్టుకోనుంది. అసలే బేవర్స్. చేతిలో రూపాయి సంపాదన లేదు. పెళ్లికి ముందు నాన్న సంపాదనపై, పెళ్లయ్యాక భార్య సంపాదనపై బతుకు ఈడ్చేసే కుర్రాడు లేని బ్యాడ్ హ్యాబిట్ అంటూ లేదు. మధ్యలో ఆ క్రికెట్ ఒకటి. ఇన్ని అవలక్షణాలున్న కుర్రోడి పాత్రలో నాగచైతన్య నటిస్తున్నాడు. భార్య పాత్రలో సమంత.. అలాంటి వీరిద్దరి ప్రేమ మజిలీ ఎలా సాగింది..? అనేది తెలుసుకోవాలంటే మరో నాలుగు రోజులు ఆగాల్సిందే మరి.