ఈ సంక్రాంతికి విడుదలైన చిత్రాల్లో 'ఎన్టీఆర్ కథానాయకుడు' ఒకటి. విశ్వ విఖ్యాత స్వర్గీయ నందమూరి తారక రామారావు జీవిత కథ ఆధారంగా క్రిష్ జాగర్లమూడి తెరకెక్కించిన చిత్రం ఇది. నందమూరి బాలకృష్ణ తన తండ్రి పాత్రలో నటించటం విశేషం. మొదటినుంచి ఇంటరెస్టింగ్ ప్రోమోలతో క్రిష్ కూడా ఈ సినిమాకి మంచి హైప్ క్రియేట్ చేసాడు. అందులోనూ, ఎన్టీఆర్ పై ప్రజల్లో ఉన్న అభిమానం అనూహ్యం. దాంతో.. ఈ సినిమా మరో క్లాసిక్ మూవీగా మంచి విజయం సాధిస్తుందని ఆశించారు.
అనుకున్నట్టుగానే మొదటి రోజు థియేటర్స్ దగ్గర సందడి నెలకొల్పి మంచి టాక్ తెచ్చుకుంది. విమర్శకుల్ని సైతం మెప్పించింది. కానీ, రెండో రోజుకే అంచనాలు తారుమారయ్యాయి. అనుకున్న కలెక్షన్స్ రాబట్టుకోవడంలో ఫెయిల్ అయ్యి.. బాక్సాపీసు దగ్గర ఈ సినిమా డిజాస్టర్‌గా మిగిలిపోయింది. బాలయ్యపై, ఎన్టీఆర్‌పై నమ్మకంతో భారీ రేట్లకు ఈ సినిమాని కొనుగోలు చేసిన బయ్యర్లు కూడా నష్టపోయారు. రూ.70 కోట్ల పై మొత్తానికే థియేట్రికల్ రైట్స్ అమ్మితే, కేవలం రూ. 20 కోట్ల షేర్‌తో సరిపెట్టుకోవాల్సివచ్చింది.
కాగా, ఈ చిత్రం ఫిబ్రవరి 7వ తేదీ నుంచి అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులోకి రానుందని తాజా సమాచారం. ఎన్టీఆర్ కథానాయకుడు ఇంత తొందరగా బుల్లితెరపై అందుబాటులోకి రావటం ఇప్పటివరకు సినిమా వీక్షించని అభిమానులకు శుభవార్తే. డిజిటల్ పరంగా ఎక్కువ మంది వీక్షించే అవకాశాలు ఉన్నాయన్న ఆశతో చిత్ర బృందం ఈ నిర్ణయం తీసుకుందట. ఇక పోతే, త్వరలో ఎన్టీఆర్ బయోపిక్ రెండో భాగం 'ఎన్టీఆర్ మహానాయకుడు' ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉంది.