రీక్యాప్ 2018: టాప్ 10 ఫ్లాపులివే

మరిన్ని వార్తలు

టాలీవుడ్‌లో విజ‌యాల శాతం ఎప్పుడూ 10 దాట‌దు. అంటే నూటికి తొంభై సినిమాలు ఫ్లాప్ అవుతుంటాయ‌న్న‌మాట‌. హిట్లు అర‌కొర ద‌ర్శ‌న‌మిస్తున్నా... ఫ్లాపులు మాత్రం వ‌రుస క‌ట్టేస్తుంటాయి. ఓ ద‌శ‌లో.. వ‌రుస ప‌రాజ‌యాలు టాలీవుడ్‌ని ఉక్కిరిబిక్కిరి చేస్తుంటాయి. 2018లో కూడా ఫ్లాపుల‌కు కొద‌వ లేకుండా పోయింది. భారీ అంచ‌నాలు పెంచుకున్న సినిమాలు బాక్సాఫీసు ముందు బోర్లా ప‌డ్డాయి. 'ఈసారి హిట్టు కొట్ట‌డం ఖాయం' అనుకున్న సినిమాలు ఫ్లాపులై.. ఆశ్చ‌ర్య‌ప‌రిచాయి. చాలా సినిమాల‌కు క‌నీసం ప్రారంభ వ‌సూళ్లు కూడా రాలేదు. అలాంటి ప‌రాజ‌యాల్లో మేటి 10 ఏమిటా?? అని ఆరాతీస్తే...

 

ఈ యేడాది ఫ్లాప్ హీరో ఆఫ్ ది ఇయ‌ర్ అనే అవార్డు ఇవ్వాల‌నుకుంటే... ర‌వితేజ‌కు మించిన ఆప్ష‌న్ దొర‌క‌దు. ఎందుకంటే 2018లో ర‌వితేజ న‌టించిన మూడు సినిమాలు విడుద‌ల‌య్యాయి. ట‌చ్ చేసి చూడు, నేల టికెట్టు, అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోనీ సినిమాలు మూడూ ఫ్లాపులుగా నిలిచాయి. నేల టికెట్టు, అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోనీ అయితే.. మ‌రీ డిజాస్ట‌ర్లుగా నిలిచిపోయాయి. సరైన క‌థ‌, క‌థ‌నాలు లేక‌పోవ‌డం, ర‌వితేజ నుంచి ఆశించే వినోదం ఈ సినిమాల్లో ఎక్క‌డా క‌నిపించ‌క‌పోవ‌డం ప్ర‌ధాన లోపాలుగా మారాయి. 

 

2018 ప్రారంభంలోనే 'అజ్ఞాత‌వాసి'తో ఓ డిజాస్ట‌ర్ త‌గిలింది టాలీవుడ్‌కి. ప‌వ‌న్ క‌ల్యాణ్ - త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్ అన‌గానే చాలా అంచ‌నాలు ఉంటాయి. వాటిని ఈ సినిమా ఏమాత్రం అందుకోలేక‌పోయింది. క‌నీసం త్రివిక్ర‌మ్ రాసిన పంచ్‌లు కూడా పేల‌లేదు. రెండు సినిమాల‌తోనే విజ‌య్ దేవ‌ర‌కొండ స్టార్ అయిపోయాడు. త‌న‌క‌న్నీ విజ‌యాలే అనుకుంటున్న స‌మ‌యంలో 'నోటా' ఓ బ్రేక్ ఇచ్చింది. ఇదో పొలిటిక‌ల్ థ్రిల్ల‌ర్‌. అయితే పాత త‌ర‌హా క‌థ‌, స్లోగా సాగిన స్క్రీన్ ప్లే.. ఈ సినిమాకి ప్ర‌తికూల అంశాలుగా మారాయి. ఎంట‌ర్‌టైన్‌మెంట్ లేక‌పోవ‌డం, హీరోయిన్ పాత్ర‌కు ఏమాత్రం ప్రాధాన్యం లేక‌పోవ‌డంతో ఈ సినిమా తుస్సుమంది. 

 

దిల్‌రాజు బ్యాన‌ర్ నుంచి వ‌చ్చిన శ్రీ‌నివాస క‌ల్యాణం బోరింగ్ సినిమా గా మిగిలిపోయి.. నితిన్ కెరీర్ కి శ‌రాఘాతంగా మారింది. నాగ్ - వ‌ర్మ‌ల జోడీ.. 'ఆఫీస‌ర్‌'తో మ‌రోసారి సంచ‌ల‌నం సృష్టిస్తుంద‌నుకుంటే.. ఆ సినిమా కూడా నిరాశ‌ప‌రిచింది. ఈ యేడాది ఛ‌ల్ మోహ‌న‌రంగ‌తో మ‌రో ఫ్లాప్‌ని త‌న ఖాతాలో వేసుకున్నాడు నితిన్‌. సాయిధ‌ర‌మ్ తేజ్‌కి 2018 కూడా క‌ల‌సి రాలేదు. ఎన్నో ఆశ‌లు పెట్టుకున్న 'తేజ్ - ఐ ల‌వ్ యూ'... ప్రేక్ష‌కుల ఆద‌ర‌ణ‌కు ఆమ‌డ దూరంలో నిలిచింది. భారీ బ‌డ్జెట్ చిత్రంగా తెర‌కెక్కిన సాక్ష్యం ఏమాత్రం మెప్పించ‌లేక‌పోయింది. యేడాది చివ‌ర్లో వ‌చ్చిన క‌వ‌చం కూడా బెల్లంకొండ‌ శ్రీనివాస్ కు బూస్ట‌ప్ ఇవ్వ‌లేక‌పోయింది.

 

ఇవ‌న్నీ టాప్ 10 ప‌రాజ‌యాలు. ఇంకా ఈ లిస్టులో చాలా సినిమాలే ఉన్నాయి. కాక‌పోతే నిర్మాత‌ల్ని దారుణంగా ముంచి, ప్రేక్ష‌కుల‌కు కొత్త త‌ల‌నొప్పి తీసుకొచ్చిన సినిమాలు మాత్రం క‌చ్చితంగా ఇవే. ఈ ప‌రాజ‌యాల నుంచి మ‌న హీరోలు, ద‌ర్శ‌కులు పాఠాలు నేర్చుకుంటారేమో చూడాలి. 

రీక్యాప్ 2018, ఐక్లిక్ మూవీస్ (iQlikmovies)


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS