ప్రభాస్ కి దీటుగా గ్రాండ్ ఎంట్రీ ఇవ్వబోతున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్..!

మరిన్ని వార్తలు

టాలీవుడ్ అగ్ర కథానాయకులకు బాలీవుడ్ లో మంచి క్రేజ్ ఉంటుంది. తెలుగు డబ్బింగ్ మరియు అనువాద చిత్రాలకు కూడా నార్త్ లో మంచి ఆదరణ లభిస్తుంటుంది. ఇటీవలే, యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన తెలుగు సూపర్ హిట్ సినిమా టెంపర్, హిందీ రీమేక్ 'సింబా' బాలీవుడ్ లో కూడా సూపర్ హిట్ అయ్యి కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. అయితే.. ఇప్పటివరకు డబ్బింగ్ మరియు అనువాద చిత్రాల్లో అలరించిన ఎన్టీఆర్ త్వరలో బాలీవుడ్ కి గ్రాండ్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. 

 

గతంలో మన అగ్ర హీరోలు కొందరు బాలీవుడ్ కి డైరెక్ట్ ఎంట్రీ ఇచ్చి విజయాన్ని అందుకున్నారు. 'చండీరాణి', 'నయా ఆద్మీ' వంటి చిత్రాలతో సీనియర్ ఎన్టీఆర్..  'సువర్ణసుందరి' సినిమాతో ఏఎన్నార్ హిందీలో మంచి విజయాన్నందుకున్నారు. ఆ తరువాతి తరం హీరోల్లో మెగాస్టార్ చిరంజీవి 'ప్రతిబంధ్', 'ఆజ్ కా గూండారాజ్' వంటి సినిమాలతో హిందీ ప్రేక్షకుల్ని పలకరించగా 'శివ', 'ఖుదాఘవా' వంటి చిత్రాలతో అక్కినేని నాగార్జున .. 'అనారి', 'తఖ్ దీర్ వాలా' సినిమాలతో విక్టరీ వెంకటేశ్ బాలీవుడ్ ప్రేక్షకులకు సుపరిచితులే. 

 

ఇక ఈ తరంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ 'జంజీర్' అనే డైరెక్ట్ హిందీ చిత్రంతో బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వగా యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ మరియు రానా బాహుబలి సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా సూపర్ స్టార్ డమ్ దక్కించుకున్నారు. ఈ సినిమా రాజమౌళికి కూడా అగ్ర దర్శకుడిగా యూనివర్సల్ గుర్తింపు తెచ్చిపెట్టింది. కాగా, ప్రస్తుతం జక్కన్న అదే తరహాలో.. కాదు కాదు.. అంతకు మించి అన్నట్టు ఎన్టీఆర్ - రామ్ చరణ్ కాంబినేషన్ లో 'ఆర్ఆర్ఆర్' చిత్రాన్ని భారీ మల్టీ స్టారర్ గా తెరకెక్కిస్తున్నారు. 

 

తెలుగు సినీ పరిశ్రమలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మించబడుతున్న 'ఆర్ఆర్ఆర్' ఓ పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ మూవీ. హీరోల లుక్స్ పరంగా, కథ పరంగా.. ట్రిపుల్ ఆర్ సినిమా బాహుబలికి ఏ మాత్రం తగ్గకుండా తెలుగు, తమిళ ప్రేక్షకులతో పాటు హిందీ ఆడియన్స్ ని కూడా మెప్పించే విధంగా రాజమౌళి ప్లాన్ చేస్తున్నాడట. ఈ సినిమాతో యంగ్ టైగర్ బాలీవుడ్ కి గ్రాండ్ ఎంట్రీ  ఇవ్వబోతున్నాడు. ఈ క్రేజీ మల్టీస్టారర్ సినిమాతో జూనియర్ ఎన్టీఆర్ బీటౌన్ లో మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకోవటం తధ్యమని నందమూరి అభిమానులు ఉత్సాహపడుతున్నారు. చూడాలిమరి.. "ఆర్ఆర్ఆర్" ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS